ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస వర్ధంతి సందర్భంగా ఆయన గురించి ! History Plus In.
రామకృష్ణ పరమహంస (జననం ఫిబ్రవరి 18, 1836 - మరణం ఆగష్టు 16, 1886) ఒక ఆధ్యాత్మిక గురువుగా విభిన్న మతాలు విభిన్న మార్గాలు ద్వారా భగవంతుడిని చేరడానికి మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి.
రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు.లలితకళలు, చిత్రలేఖనములో ఆసక్తి చూపించేవారు అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించేవారు కాదు. ప్రకృతిని ప్రేమిస్తూ, గ్రామము బైట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవారు. పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామము గుండా వెళ్ళేవారు. వారు ఆ గ్రామములో ఆగి ప్రసంగిచేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్ధగా వినేవారు.
ఉపనయనము కాగానే బ్రాహ్మణునిగా మొదటి భిక్ష, ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడము చాలా మందికి ఆశ్చర్యము కలిగించింది. బ్రాహ్మణుని వద్దనే మొదటి భిక్ష పొందవలననే నియమాన్ని ఎంత వాదించినా, ఎంత మంది చెప్పినా వినకుండా ఆ యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పాక ఎటువంటి బ్రాహ్మణుడవుతాడని ప్రశ్నించాడు. చివరికి ఆతని జ్యేష్ట సోదరుడు రామ్‌కుమార్ తండ్రి మరణము తరువాత అంగీకరించెను.
పూజారి జీవితము !
కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతూ వచ్చింది. ఆ కాలములో రాణీ రాషమొణి అనే ధనిక యువతి, దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి రామ్‌కుమార్ ను పురోహితుడుగా ఉండమని కోరింది. రామ్‌కుమార్ దానికి అంగీకరించాడు. కొంత ప్రోద్బలముతో గధాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకున్నాడు. రామ్‌కుమార్ మరణించిన తరువాత రామకృష్ణుడు పూజారిగా బాధ్యతలను తీసుకొన్నారు.
గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తా అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానము ఇవ్వడము లేదు? అనుకొనేవారు. ఈ ప్రశ్న ఆయనను రాత్రి, పగలు కలచివేసింది. ఇక కాళికా దేవిని ప్రత్యక్షము కమ్మని తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవారు. రాత్రిళ్ళు అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు. అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమ సత్యమును తెలిసికొనుటకై ప్రార్థించేవారు.
ఆధ్యాత్మిక గురువులు మరియు సాధనలు !
తోతాపురి అను నాగా సాంప్రదాయపు సాధువు వీరికి అద్వైతజ్ఞానం ఉపదేశించారు. వీరి గురువుగారు చిన్నప్పటినుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజులలోనే పొందారు. తర్వాత భైరవీ బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు. ఈ విధంగా భగవత్, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.
వైవాహిక జీవితము !
రామకృష్ణుడు దక్షిణేశ్వర్ లో అత్మజ్ఞాన అభ్యాసములతో పిచ్చివాడై పోయాడని పుకారు వచ్చింది. ఊరివారు రామకృష్ణుని తల్లితో ఆతనికి వివాహము చెయ్యమని, దానితో సంసారిక బాధ్యతలలో పడగలడని చెప్పారు. వివాహమునకు అభ్యంతరము చెప్పక పోవడమే కాకుండా, మూడు మైళ్ళ దూరములో ఉన్న జయరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్ళికూతురు దొరుకుతుందని చెప్పాడు. 5 ఏళ్ళ శారదా దేవితో ఆతని పెళ్ళి నిశ్చయమైనది. శారద రామకృష్ణుని మొదటి శిష్యురాలు. ఆయన గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తిగా పూజించడము మొదలు పెట్టాడు. ఆమెను సాక్షాత్ కాళికాదేవి లా భావించి పూజించారు. ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు.
ఆమె పరిత్యాగము రామకృష్ణుని పరిత్యాగము వలే శిష్యులందరికి ప్రస్ఫుటముగా కనపడేది. వారిద్దరి సంబంధము సామాన్య మానవులు అర్థము చేసుకోలేరని భావించేవారు. మతగురువుల జీవితాల్లో స్త్రీ, పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధము ఉండడము ఇంకెక్కడా కానరాదు. రామకృష్ణుని మరణానంతరము శారదా దేవి కుడా మతగురువుగా మారెను.
ఆధ్యాత్మిక గురువుగా !
ఆ తరువాత కొద్ది కాలములోనే రామకృష్ణు పరమహంసగా పిలవబడెను. ఆయస్కాంతము లాగ భగవంతుని పొందగోరే వారిని అకర్షించేవారని ప్రతీతి.
వీరికి ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరి పేరు ప్రపంచ ప్రఖ్యాతి పొందడానికి దోహదం చేసినది వివేకానందులు. వీరి పరిచయం విచిత్రంగా జరిగింది. అప్పటికి వివేకానందులు నిజంగా భగవదనుభం పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు. "మహాత్మా మీరు భగవంతున్ని చూసారా?" అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందాడు. రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు.
రామకృషుని బోధనలలో ముఖ్యాంశములు.
- సృష్టిలో ఏకత్వము
- అన్ని జీవులలో దైవత్వము
- ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము. అన్నిమతాల సారాంశం ఒక్కటే.
- మానవ జీవిత ములో దాస్య కారకాలు కామము, స్వార్థము. కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.
- మానవ సేవే మాధవ సేవ
- ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.
- ఎక్కడ జీవశక్తి ఉండు నో అక్కడ శివుడు ఉండును అతని అద్వైత జ్ఞానము వలన వచ్చెను. దీని వలన మానవుల యందు దయ మాత్రమే చూపించుట వలన కాకుండా వారిని సేవించుట వలన శివుని సేవించవచ్చును.
ఆది శంకరాచార్యులు వలే రామకృష్ణ పరమహంస, హిందూ మతములో పేరుకు పోయిన అధిక సంప్రదాయములు, మూఢ నమ్మకాలను 19 వ శతాబ్దములో కొంతవరకూ తొలగించి, హిందూ మతముని నవీన శకములో ఇస్లాం, క్రైస్తవ మతముల సవాళ్ళకు దీటైన పోటీగా నిలబెట్టారు. అతని వలన భక్తి ఉద్యమము, అరబిందో కుడా ప్రభావితమయ్యారు.
అలాగే స్వామీ వివేకానందుని బోధనలలో చాలా భాగం రామకృష్ణులవే.
ప్రవచనాలు !
- జ్ఞానము ఐకమత్యానికి, అజ్ఞానము కలహాలకి దారి తీస్తాయి.
- మానవుడు ఆలోచనతోనే మనిషిగా మారతాడు
- భగవంతుని దర్శించడము అందరికీ సాధ్యమే. గృహస్తులు ప్రపంచాన్ని వదిలి చేయనక్కర లేదు కాని వారు శ్రద్దగా ప్రార్థించాలి. శాశ్వతమైన వస్తువులకు క్షణికమైన వస్తువులకు తేడా గమనించే వివేకము కావాలి. బంధాలను తగ్గించుకోవాలి. దేవుడు శ్రద్దగా చేసే ప్రార్థనలను వింటాడు. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యము.
- కామము, అసూయ దేవుని దర్శనానికి రెండు ముఖ్య శత్రువులు.
కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్కు తన నివాసాన్ని మార్చారు. చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు. 1886 ఆగష్టు 16న మహాసమాధిని పొందాడు. అయన వదిలి వెళ్ళిన పదహారు మంది శిష్య సమ్మేళనమునకు స్వామీ వివేకానంద సారథ్యము వహించాడు. వివేకానంద ఆ తరువాత మత తత్త్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ధి పొందాడు.
Post a Comment