కరీంనగర్ జిల్లాకు చెందిన : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత జైరాజ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కధనం
పైడి జైరాజ్ (సెప్టెంబరు 28, 1909 - ఆగష్టు 11, 2000) భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.
కరీంనగర్ జిల్లాకు చెందిన జైరాజ్ గారు హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి సినిమాలపై మోజుతో 1929 లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యోయేట 1930 లో తొలిసారిగా " స్పార్క్లింగ్ యూత్ " అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో " ట్రయంఫ్ ఆఫ్ లవ్ " అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. 1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన " షికారి " ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి పెద్ద హీరోల సరసన మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరుపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ ల సరసన నటించారు. అనేక విజయాలనూ చవిచూశారు.భారత కోకిల సరోజినీ నాయుడు గారు జైరాజ్ గారికి పినతల్లి అవుతారు.
'మూకీ' సినిమా రోజులలో 11 సినిమాలు, తరువాత సుమారు 156 'టాకీ' సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిందీ, ఉర్దూ భాషలతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. అనేక రకాల పాత్రలు ధరించినా ఇతను పోషించిన జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తుండేవి, ప్రేరణ కలిగించేవి. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. బొంబాయి చిత్రసీమలో ప్రవేశించి హీరోగా ఎదిగి హిందీ, ఉర్దూ మొదలైన భాషల్లో సుమారు 170 చిత్రాల్లో నటించిన తెలుగువాడు పైడి జైరాజ్ గారు.
దర్శకత్వం వహించిన సినిమాలు !
పైడి జైరాజ్ మెహర్, రాజ్ ఘర్, మాల, ప్రతిమ అనే నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. పి.జె. ఫిల్మ్స్ యూనిట్ పతాకంపై ప్రసిద్ధనటి నర్గీస్ కథానాయికగా 'సాగర్' చిత్రాన్ని 1951లో నిర్మించాడు.
అవార్డులు !
జైరాజ్ గారు భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1980లో కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసి గౌరవించింది.
Post a Comment